దారి దీపాలవుదాం రండీ !

మానవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ (స) ఈ భూమి మీద 63 సంవత్సరాలు జీవించినప్పటికి ఆయన ధర్మ ప్రచారం, ధర్మ స్థాపన ప్రయత్నం 23 సంవత్సరాలు చేసినప్పటికీ ఆయనను గురించి నేటికీ మనం మాట్లాడుకోవడానికి గల కారణాలు గమనింస్తే ఆయన జీవించిన విధానంలోగానీ, క్రియలలోగాని, ప్రవర్తనలోగాని, తలంపులలోగానీ, ఆలోచనలలోగానీ ఏ మచ్చ లేకుండా ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగే దీపమయి వందల కోట్ల దీపాలను ప్రపంచంలో వెలిగించారు. మానవ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో చెరగని ముద్రను వేసినటువంటి మానవ మహోపకారిగా ఘన కీర్తిని గడించారు అన్న విషయం మనందరికీ తెలుసు. మన దైనందిన ధార్మిక జీవితంలో విశ్వాసులుగా మనం దారి దీపాలుగా మార్చబడిన తరువాత అనేకమంది జీవితాలను వెలిగించే వ్యక్తులుగా మన మీద బాధ్యత మరింత పెరిగింది.
ధర్మ దారి తెలియని అందరికి కాకపోయిన ఏ కొందరికయినా మనం దారి దీపం అవ్వాలి. మన ప్రాంతంలో, మన ఇరుగుపొరుగులో ధర్మ దీపాలయి ప్రకాశించాలి. మిత్రులారా! ఒక్క క్షణం ఆలోచించండి, మనం అనాథగా ఉన్నప్పుడు అల్లాహ్ మనకు ఆశ్రయం కల్పించలేదా? మనం అవసరంలో ఉన్నపుడు అల్లాహ్ మనల్ని ఆదుకోలేదా? మనం ధర్మ దారి తెలియక మార్గవిహీనులమయి ఉండగా అల్లాహ్ మనకు మార్గం చూపలేదా? మనం నిరుపేదగా ఉండటం చూసి అల్లాహ్ మనల్ని ధనవంతుల్ని చేయలేదా? కనుక మనం సయితం అనాథల్ని అనుంగు సంతాంగా భావించి అక్కున చేర్చుకోవాలి. అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు. అవసరార్ధుల్ని ఆసరా ఇచ్చి ఆదుకోవాలి. మార్గం తెలియని అల్లాహ్ దాసుల్ని ఆయన మార్గం వైపునకు మనసయిన పద్ధతిలో ఆహ్వానించాలి. నిరుపేదలకు కావాల్సిన కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయాలి. యాచకుడ్ని కసరి కొట్టకూడదు. వీటన్నింటితోపాటు మనందరి ప్రభువు అయిన అల్లాహ్ అనుగ్రహాల్ని గురించి చాటుతూ కృతజ్ఞత నిండిన మనసుతో జీవించాలి ఫలితంగా - మన కోసం ప్రారంభకాలం కంటే ఆ తరువాత కాలం నిస్సందేహంగా ఎంతో మేలయినదిగా ఉంటుంది. త్వరలోనే మన ప్రభువు మనకు గొప్ప వరాలు అనుగ్రహిస్తాడు. వాటిపట్ల మనం ఖచ్చితంగా సంతోషిస్తాము. అయితే, అత్యంత బాధాకరమయిన విషయం ఈమిటంటే, ఒకప్పుడు దైవభీతి, పరలోక ప్రీతితో అలరారినవారే, ఒకప్పుడు పరిశుద్ధంగా, నీతిమంతులుగా జీవించిన వారే ప్రస్తుతం - పరిసరాల ప్రభావం వల్లనో, ప్రయోజనాల ప్రలోభం వల్లనో, కామం వల్లనో, మోహ, మదం, మాత్సర్యాల వల్లనో మనసుల్ని, మాటల్ని కలుషితం చేసుకుంటున్నారు ఎందుకు అంటే, వారి ఆత్మలోని ధర్మజ్యోతి కొడిగట్టుకుపోయింది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఉండేదా వారి గతం అని ఆలోచన కలుగక మానదు. ఇప్పుడు ఆ ధర్మ కాంతి లేకపోవడం వల్ల హృదయ వినీలాకాశానికి కోరికల కర్రీ మబ్బులు క్రమ్ముకున్నాయి. అంధకారం అందలమెక్కి అన్నింటిపై అధికారం చెలాయిస్తున్నది. ఈరోజు అనేక మంది ముస్లింలు ప్రకాశించే ప్రమిదలుగా లేరు. పైగా ఎవరన్నా వెలుగుతున్నా సహించలేక, కుళ్ళుబోతుతనంతో వారి జీవితాలను ఆర్పి వేసే ప్రమాదకర వ్యక్తులుగా తయారైనారు ఈ దయనీయ స్థితికి కారణం - మన అకీదా (ఇస్లామీయ మౌలిక విశ్వాససం) సరియైన రీతిలో లేదు. మన చేసే కర్మలు, స్వయం క్రియలు సరిగ్గా లేవు. కనుకనే మనమున్న ఇంట్లో, మన పరివారంతో, మన పరిసర ప్రాంతాల్లో వెలుగుండటం లేదు. అల్లాహ్ మనల్ని సన్మార్గం చూపి ఎందుకు విశ్వాసులుగా చేశాడు? సమాధానంగా ఖుర్ఆన్ అల్లహ్ ఏమంటుందో చూడండీ, మీలో ఒకవర్గం (ప్రజల్ని) మంచి వైపునకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించేవారు, చెడు పనుల నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారే (ఇహపరలోకాల్లో) సాఫల్యం చెందేవారు. స్పష్టమైన సూచనలు, ప్రమాణాలు వచ్చి నప్పటికీ పరస్పరం విభేదించుకొని విభిన్నవర్గాలుగా చీలిపోయినవారిలా మీరూ కాకండి. అలాంటివారికి ఘోరమైన (నరక) యాతనలు కాచుకొని ఉన్నాయి. (ఆల్-ఇమ్రాన్: 104-105)
అల్లాహ్ కొటాననుకోట్ల మంది మధ్య మనల్నే ఎందుకు దారి దీపాలుగా ఎన్నుకున్నాడు, మన పరివారంతో, మన పరిసర ప్రాంతంలో వెలుగుగా ప్రజ్వలించాలనే కదా, ఆధ్యాత్మికంగా ఆరి పోతున్న అనేకమంది జీవితాలను వెలిగించాలానేగా, వెలుగులిన్ పంచాలనేగా! పతనమవుతున్న సమాజాన్ని, విలువాల్ని, ప్రజా జీవితాల్ని ప్రగ్తాయ్ పథాన పురోగమించేలా చేయాలనేగా! మన ఉపమానం వెలిగే లైట్ హౌస్ వంటిది. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లె కాదు పట్టణం కాదు ఎక్కడ చూసినా పాపం, జూదం, వడ్డీ వ్యాపారం, పాచికల జోస్యం, వ్యభిచారం, హత్యలు. అత్యాచారాల, అపహరణాల భయానక వాతావరణం నెలకొని ఉంది. ఒకప్పుడు కొన్ని ప్రత్యేక ప్రాంతాలకి పరిమితమైన ఈ పాపిష్టి పనులు నేడు మన ప్రాంగణంలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి, నరుని అర చేతిలో అంతర్జాలం సృష్టిస్తున్న అనర్థాలు, భయంకర విపరిణామాలు ఎన్నో ఎన్నెన్నో! ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో పాప ప్రీతి విపరీతంగా పెరుగుతూ ఉంది. కారణం మనకు అల్లాహ్ ఇచ్చిన సృష్టి లక్ష్యాన్ని మనం మరచి పోయాము. విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠసమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. అల్లాహ్ ను ప్రగాఢంగా విశ్వసిస్తారు. (ఆల్-ఇమ్రాన్: 110) అల్లాహ్ మనల్ని వెలగమని చెప్పిన రీతిన మనం వెలగటం లేదు. మన కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించడం లేదు. కనుకనే ముస్లిం సమాజంలో సయితం నేరాలు ఘోరాలు పెచ్చు మీరుతున్నాయి. ఆడపిల్లల ఆస్తి హక్కు స్వాహా చేయబడుతున్నది. ఓ విశ్వాసీ! నిన్ను నువ్వే ప్రశ్నించుకో! నీ ప్రాంతం గురించి, నీ వారి రక్షణను గురించి బాధ్యత నీకు లేదా? వారిని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ బాట నడిపించాల్సిన గురుతర బాధ్యత నీకు లేదా? విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీభార్యాపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. దానికి మానవులు, రాళ్ళు సమిధలవుతారు. అక్కడ దృఢకాయులైన, కఠిన (హృదయు లైన) దైవదూతలు (నరకనిర్వాహకులుగా) నియమితులైఉంటారు. వారు దేవుని ఆజ్ఞల్ని ఏమాత్రం జవదాటరు. ఏఆజ్ఞ వచ్చినా తక్షణమే దాన్ని శిరసావహిస్తారు. (అత్-తహ్రీమ్: 6) రేపు ప్రళయ దినాన అల్లాహ్ తో జవాబు చెప్పుకోవాల్సిన, లెక్క చూపించాల్సిన బాధ్యత, భారం మనదే కదా! నా దాసులయిన ప్రజలు పాప పంకిలంలో పీకల్లోతుకు పాతుకుపోతున్నప్పుడు వారిని మార్చవలసిన బాధ్యత మీది కాదా? వారి జీవితాలను విజ్ఞాన వెలుగులతో నింపాల్సిన బాధ్యత మీదే కదా? అని అల్లాహ్ నిలదీస్తే దానికి మనం ఇచ్చుకునే సంజాయిషీ ఏమిటి? మనమే ఆరిపోయే దీపాలుగా వుంటే ఇతరులకు మనమెలా దారి దీపాలం కాగలం చెప్పండీ !

Comments